అమ్మ కాదు.. రాతి బొమ్మ!

A mother brutality on her kid - Sakshi

 • ప్రియుడి మోజులో పడి నాలుగేళ్ల చిన్నారిని కాలుతున్న పెనంపై కూర్చోబెట్టిన తల్లి
 • ‘కంటేనే అమ్మ అని అంటే ఎలా.. కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కదా.. రాతి బొమ్మే కదా..!’ అమ్మతనాన్ని, పేగుబంధాన్ని దారపుపోగులా తెంపేసే తల్లి తల్లే కాదంటూ ఓ సినీకవి పడ్డ ఆవేదన ఇదీ! తన అక్రమ సంబంధానికి అడ్డొస్తుందన్న కారణంతో కన్నబిడ్డను రాచిరంపాన పెట్టిన అలాంటి ఓ ‘రాతి బొమ్మ’కర్కశత్వం వెలుగుచూసింది. ప్రియుడి మోజులో పడి అభంశుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిని కాలుతున్న పెనంపై కూర్చోబెట్టింది. చిగురుటాకులాంటి పాప పెనంపై విలవిల్లాడిపోతున్నా ఆమె గుండె కరగలేదు. చివరికి ప్రియుడితో కలిసి పాపను వదిలించుకోవాలని చూసి పోలీసులకు చిక్కింది. ఇక మరో ఘటనలో 12 ఏళ్ల బాలికపై మారుతండ్రే పశువులా ప్రవర్తించాడు. ఈ రెండు ఉదంతాలు ఆదివారం హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్, బంజారాహిల్స్‌ పరిధిలో వెలుగులోకి వచ్చాయి.
 • ప్రియుడు చెప్పాడని.. 
  శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన లలితకు గతంలోనే వివాహమైంది. నాలుగేళ్ల కూతురు రూప ఉంది. ఇదే జిల్లాకు చెందిన వివాహితుడు ప్రకాశ్‌కు ముగ్గురు సంతానం. వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో కొన్నాళ్ల క్రితం ఇరువురూ హైదరాబాద్‌కు పారిపోయి వచ్చారు. ప్రకాశ్‌ తన భార్యాపిల్లల్ని అక్కడే వదిలి రాగా… లలిత మాత్రం తన బిడ్డ రూపను వెంట తెచ్చుకుంది. వీరిద్దరూ ఎస్సార్‌నగర్‌లో ఉన్న వెస్ట్‌ శ్రీనివాస్‌నగర్‌లోని పద్మావతి బాయ్స్‌ హాస్టల్‌లో పనులకు చేరారు. నిర్వాహకులతో తాము భార్యాభర్తలమని, తమ వెంట ఉన్నది కన్నబిడ్డని నమ్మబలికారు. హాస్టల్‌లో లలిత వంట మనిషిగా పనిచేస్తుండగా.. ప్రకాశ్‌ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. హాస్టల్‌లో ఉన్న ఓ చిన్న గదిలో ఇద్దరూ నివాసం ఉంటున్నారు. తాను తన భార్యతోపాటు పిల్లల్ని వదిలేసి వచ్చానని, నీవు కూడా రూపను వదిలించుకోవాలని కొన్ని రోజులుగా లలితపై ప్రకాశ్‌ ఒత్తిడి తెస్తున్నాడు.

  మొదట్లో వారించినా కొన్ని రోజుల తర్వాత.. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న బిడ్డను వదిలించుకోవాలని భావించింది లలిత. నేరుగా వదిలేస్తే ఇబ్బందని భావించిన లలిత, ప్రకాశ్‌లు.. బాలిక భయభ్రాంతులకు గురయ్యేలా చిత్రహింసలు పెట్టాలని భావించారు. ఈ క్రమంలోనే లలిత రెండ్రోజుల క్రితం మండుతున్న పొయ్యిపై ఉన్న పెనంపై చిన్నారని కూర్చోబెట్టింది. దీంతో బాలిక కాళ్లతోపాటు సున్నిత భాగాల్లో తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అమ్మే ఇలా అమానుషంగా ప్రవర్తిస్తుంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆ పాప విలవిల్లాడింది. వెక్కివెక్కి ఏడుస్తున్నా ఆ తల్లి గుండె కరగలేదు. గాయాలేంటని అడిగిన వారితో.. ప్రమాదవశాత్తు కాలిందని చెప్పి నమ్మించింది. చివరకు బాలికను పూర్తిగా వదిలించుకోవాలనే ఉద్దేశంతో ప్రకాశ్‌తో కలసి పథకం వేసింది. శనివారం రాత్రి వీరిద్దరూ చిన్నారిని తీసుకుని నాంపల్లిలోని భరోసా కేంద్రానికి చేరుకున్నారు.

 • అక్కడున్న సిబ్బందితో తమకు కాలిన గాయాలతో ఉన్న ఓ చిన్నారి దొరికిందని, అనాథగా భావించి అప్పగించడానికి తెచ్చామని చెప్పారు. దీంతో అక్కడి సిబ్బంది చైల్డ్‌లైన్‌ విభాగానికి సమాచారమిచ్చారు. ఆ విభాగం ఉన్నది గోపాలపురం ఠాణా పరిధిలో కావడంతో అక్కడకు పంపారు. చైల్డ్‌లైన్‌ అధికారులు వచ్చేలోపు గోపాలపురం పోలీసులు చిన్నారిని బుజ్జగించి మెల్లిగా వివరాలు ఆరా తీసే ప్రయత్నం చేశారు. దీంతో కన్నీరుమున్నీరైన ఆ పాపా తాను అనాథను కాదని, లలిత తన తల్లి అని చెప్పి రోదించింది. ఆమే తనను పెనంపై కూర్చోపెట్టడంతోనే గాయాలయ్యాయని చెప్పింది. దీంతో షాక్‌కు గురైన పోలీసులు… చిన్నారిని వదిలించుకోవడానికి లలిత, ప్రకాశ్‌ నాటకం ఆడినట్లు గుర్తించారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని చిన్నారితో సహా ఎస్సార్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న చైల్డ్‌లైన్‌ అధికారి ఠాణాకు వచ్చి ఫిర్యాదు చేశారు. లలిత, ప్రకాశ్‌లపై పోలీసులు కేసు నమోదు చేసుకుని అదుపులోకి తీసుకున్నారు. బాలికను యూసుఫ్‌గూడలోని శిశువిహార్‌కు తరలించి వైద్య చికిత్స చేయిస్తున్నారు. అక్కడి అధికారులే బాలిక సంరక్షణ బాధ్యతలు చేపట్టారని, అవసరమైతే అదనపు వైద్య సేవలు అందిస్తారని పోలీసులు చెప్పారు. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు డిమాండ్‌ చేశారు.
 • వావి వరుసలు మరిచి.. 
  వావి వరసలు మర్చిన ఓ సవతి తండ్రి.. కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. యూసుఫ్‌గూడ సమీపంలోని ఎల్‌ఎన్‌ నగర్‌లో నివాసం ఉంటున్న వ్యక్తి కూరగాయల వ్యాపారం నిర్వహిస్తుంటాడు. భార్య ఉండగానే మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య కూతురు (12)పై కొంతకాలంగా కన్నేశాడు. తరుచూ ఆ చిన్నారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తుండడంతోపాటు లైంగిక వేధింపులకు పాల్పడుతూ నరకం చూపుతున్నాడు. తల్లితో పాటు ఎవరూ పట్టించుకోకపోవడంతో దిక్కుతోచని చిన్నారి చుట్టుపక్కల వారికి తన గోడు చెప్పుకుంది. దీంతో ఓ గుర్తు తెలియని వ్యక్తి షీ–టీమ్స్‌కు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన షీ–టీమ్స్‌ సిబ్బంది బాలికను సవతి తండ్రి బారి నుంచి రక్షించి చైల్డ్‌లైన్‌ సిబ్బందికి అప్పగించారు. బాలికను చైల్డ్‌లైన్‌ అధికారులు బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి జరిగిన ఘాతుకంపై ఫిర్యాదు చేశారు. చిన్నారి వద్ద వాంగ్మూలం తీసుకున్న పోలీసులు.. ఆమెను బాలికల పునరావాస కేంద్రానికి తరలించారు. బాలిక సవతి తండ్రిపై కేసు నమోదు చేశారు.