.అమ్మ….నాకు కనిపించే దైవం…నా జీవితానికో స్ఫూర్తి మూర్తి

 sircilla srinivas, may 11, telanganareporter
 
anudeep ssvas.jpg1
అమ్మ నా దిక్సూచి
 అమ్మ నా ధైర్యం
అమ్మ మా ఇంటికి వెలుగు…
నా జీవితానికో స్ఫూర్తి మూర్తి.. నా ప్రతీ అడుగులో తన చేయూత వెలకట్టలేనిది…. ఈ రోజు నేనింతటి స్థాయిలో ఉన్నానంటే అమ్మ నాకోసం అహర్నిశలు పడ్డ శ్రమ ఫలితమే….
anudeep with mother
ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మగా జ్యోతి లభించడం నా పూర్వ జన్మ సుకృతం.
నేను పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పటి నుండి అలారమ్ పెట్టుకొని నన్ను వేకువ జామున లేపేది. ఉదయం 6.30వరకల్లా నా దుస్తులు ఇస్త్రీ చేసి రెడీ పెట్టి నన్ను తయారు చేసేది.
ఏనాడు చదువు గురించి నన్ను ఒత్తిడి పెట్టేది కాదు. ఆటలకు సమయం తప్పకుండా కేటాయించాలని నాకు బోధించేది. ప్రతీ సాయంత్రం గంటన్నర పాటు నా మిత్రులతో మా ఆదర్శనగర్ గ్రౌండ్ లో క్రికెట్ ఆడుకోడానికి ప్రోత్సహించేది. నేను ఓడిపోయి వచ్చినపుడు గెలుపోటములు సమానంగా స్వీకరించాలని నన్ను సముదాయించేది.
anudeep with mother-father
నేను సివిల్స్ కొరకు 5 సార్లు ప్రయత్నిస్తే 3 సార్లు ఓడినా అమ్మ నా వెన్నంటి ఉండి ధైర్యం చెప్పే మాటలే గుర్తొచ్చేవి. మానసిక వికాసానికి ఆటలు ఎంత ముఖ్యమో నాకు తెలియజేసింది. అందువల్లనే ఈ రోజు నేను ముస్సోరి అకాడమీ ఫుట్ బాల్ కెప్టెన్ గా రాణించగలిగాను.
అఖిల భారత సర్వీసు ప్రొబేషనర్ల పోటీల్లో రన్నర్ అప్ గా నిలిచాము. చదువు, ఆటలకు సమాన ప్రాదాన్యం ఇస్తే జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎదురొడ్డి నిలవచ్చని నాకు నూరిపోసింది.
సీటు రాలేదని కుంగిపోవద్దు….
నేను ఐ ఐ టీ లో ఇంజినీరింగ్ సీటు కొరకు సన్నద్ధమయే సమయంలో చికెన్ పాక్స్ కు గురయ్యాను. తీవ్ర జ్వరంతో వారంపాటు బెడ్ పై నుండి లేవలేదు. పరీక్ష రాయలేక పోయాను. ఎంతో బాధపడే సమయంలో నాకు అమ్మ చాలా ధైర్యం ఇచ్చింది. మరో అవకాశం నీకు తప్పకుండా వస్తుంది అని చెప్పింది. అక్షరాల అమ్మ మాటలు నిజమయ్యాయి.
నాకు బిట్స్ పిలాని లో మంచి ర్యాంక్ తో ఎలక్ట్రానిక్స్ లో సీట్ వచ్చింది. రాజస్థాన్ లో ఉన్న 4 ఏళ్లలో నేను ఒక కొత్త ప్రపంచాన్ని చూసాను. నా జీవితంలో ఎదగడానికి అదొక మలుపుగా భావిస్తాను. ఇందుకు అమ్మే కారణం.
పండుగలకు, ఇంట్లో శుభకార్యాలకు నాకోసం అమ్మ ఆరాటం….
నేను ఇంజినీరింగ్ పూర్తయ్యాక దాదాపు 2 ఏళ్ళపాటు ఢిల్లీలో ప్రిపరేషన్, తర్వాత 3ఏళ్ళు ఐ ఆర్ ఎస్ అధికారిగా ఫరదాబాద్ లో ట్రైనింగ్, హైదరాబాద్ లో విధులు ఇలా మొత్తం 7 ఏళ్ళు ఏ పండగకి మెటుపల్లి లో ఇంటికి రాలేకపోయాను. అమ్మ ఏడిస్తే ఫోన్లో సముదాయించే వాణ్ణి.
ఐ ఏ ఎస్ సాధన వెనుక అమ్మ…..
2017 లో నా ఐదో మరియు చివరి ప్రయత్నం సివిల్స్ సాధనకు  ప్రయత్నం చేస్తాను అని అమ్మకు చెపితే అసిస్టెంట్ కమిషనర్ గా ఉద్యోగం ఒత్తిళ్లతో సమయం దొరుకుతుందా అని సందేహం వెలిబుచ్చింది. నీవు నేర్పిన సమయ పాలన తోనే ప్రిపేర్ అవుతాను అని చెప్పాను. బాగా రాశాను, మరో ఓటమి ఎదురైనా మంచి అటెంప్ట్ ఇచ్చిన సంతృప్తి ఉందని చెప్పా! అమ్మ సరేనంది.
అలా ఒక రోజు ఫలితాలు  రానే వచ్చాయి.
గతేడాది ఏప్రిల్, 27 సాయంత్రం 6 గంటలకు అమ్మా నాకు ఒకటో ర్యాంకు వచ్చింది అని చెప్పగానే సంతోషంతో ఫోన్ లోనే నాకు ముద్దులు పెడుతూ బోరున ఏడ్చింది.
అమ్మ కలల్ని ఇలా నిజం చేసినందుకు నాకు కూడా ఎనలేని ఆనందంగా ఉంది.
రేపు మే 24 నాడు భద్రాద్రి కొత్తగూడెం అసిస్టెంట్ కలెక్టర్ గా నేను విధుల్లో చేరబోయే మధుర క్షణాల కొరకు చూసే అమ్మ కళ్ళల్లో ఎంత వెలుగో చెప్పరానిది.
అమ్మ ఉద్వేగం…..
ఫలితాలు వెలువడ్డాక జిల్లాకలెక్టర్, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి విందుకు ఆహ్వానించినపుడు అమ్మ ఎంతో ఉద్వేగానికి లోనయింది. నీ ద్వారా నాకు ఇంత గొప్ప గౌరవం అందించావురా కన్నా, మా జీవితానికిది చాలు అని సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయింది. నా విజయం నీ వల్లనే అని చెప్పాను.

మాతృదేవోభ..