కసాయి కొడుకులు!!!!!!…

 • ఎనభై ఏళ్ల వయసు.. నలభై ఏళ్ల అంధత్వం.. పదేళ్ల క్రితం పక్షవాతంతో కాలం చేసిన భార్య..
 • ఆస్తులు తీసుకుని తండ్రిని కాదన్న కొడుకులు
 • ఒకే ఊళ్లో ఉంటున్నా కన్నెత్తి చూడని దైన్యం
 • అన్నం, నీరు, ఉప్పుతోనే వెంకటరెడ్డి బతుకు
 • సిద్దిపేట జిల్లా చంద్లాపూర్‌లో అమానవీయం
 • ఎనిమిది పదుల వయసు! రెండు కళ్లూ కనిపించవు! తోడు లేకుండా అడుగు వేయలేని స్థితి! ఇరుగు పొరుగు ఏ కూరైనా వేస్తే అదే పరమాన్నం. లేదంటే, అన్నంలో ఉప్పు, నీరే గతి! ఒక కన్ను పోవడానికి కొడుకులే కారణం! అయినా, ఆస్తులు పంచుకున్నారు! అదే ఊళ్లో హాయిగా బతుకుతున్నారు! బతుకును, ఆస్తులను ఇచ్చిన తండ్రిని మాత్రం అమానవీయంగా వదిలేశారు! దాంతో, దిన దిన గండం.. నూరేళ్ల ఆయుష్షు అన్నట్లు ఆయన బతుకుతున్నాడు. అందరూ ఉండి అనాధగా బతుకుతున్న సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌కు చెందిన ఏనుగుల వెంకట్‌ రెడ్డి దయనీయ స్థితిపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం! వెంకట్‌ రెడ్డికి భార్య లచ్చవ్వ, కొడుకులు భూంరెడ్డి, బాపురెడ్డి, కూతుళ్లు లక్ష్మి, రమ ఉన్నారు.
  భార్య తొమ్మిదేళ్ల కిందట చనిపోయింది. తనకు పిత్రార్జితంగా వచ్చిన ఎనిమిది ఎకరాలను సాగు చేసి, నాలుగు దశాబ్దాల కిందటి వరకూ కుటుంబాన్ని వెంకట్‌ రెడ్డి పోషించాడు. పిల్లలకు పెళ్లిళ్లు చేశాడు. అయితే, 40 ఏళ్ల కిందట వ్యవసాయ బావి వద్ద బండలను తొలగించేందుకు బ్లాస్టింగ్‌ ద్వారా గుంతల్లో పూసలు(బాక్సైట్‌ మందు) నింపారు. వాటిలో కొన్ని పేలలేదు. ఈ విషయం తెలియని వెంకట్‌ రెడ్డి.. కొద్ది రోజుల తర్వాత మందు నింపిన ప్రాంతంలో గడ్డికి నిప్పంటించి చలి కాచుకున్నాడు. దాంతో, పేలుడు సంభవించి అతడి కళ్లల్లో ఇసుక రేణువులు, రాయి చిప్పలు పడ్డాయి.
  చికిత్స చేసిన వైద్యులు ఒక కన్ను పోయిందని, సర్జరీ చేస్తే మరో కన్ను కనిపిస్తుందని తెలిపారు. కానీ, అతని కొడుకులు సర్జరీ చేయించకుండానే ఇంటికి తెచ్చేశారు. దాంతో వెంకట్‌ రెడ్డి రెండో కంటి చూపు కూడా కోల్పోయాడు. కొడుకులు తల్లిదండ్రులను వదిలేసి వేరు కాపురం పెట్టారు. పక్షవాతం వచ్చి లచ్చవ్వ మంచాన పడి కొన్ని రోజులకు కన్నుమూసింది. ఆ సమయంలో దుబాయ్‌లో ఉన్న చిన్న కొడుకు కనీసం తల్లికి తలకొరివి పెట్టేందుకు కూడా రాలేదు. ఊళ్లో ఉన్న పెద్ద కొడుకు చుట్టపు చూపులా వచ్చి వెళ్లాడు. దీంతో, వెంకట్‌ రెడ్డే భార్య చితికి నిప్పంటించాడు.
  ఆస్తి పంచుకొని అవతల పడేశారు
  వారసత్వంగా వచ్చిన ఆస్తి కోసం కొడుకులు ఆరాటపడ్డారు. కానీ, జన్మనిచ్చిన తండ్రికి కాసింత కలో గంజో పోయాలన్న తపన వారికి కలగలేదు. ఏడు ఎకరాలను కొడుకులు ఇద్దరూ చెరి సగం పంచుకున్నారు. తండ్రి పేరిట ఎకరా 20 గుంటలు ఉంచారు. అయినా, తండ్రికి గంజి పోయలేదు. తండ్రి పేరు మీద ఉన్న భూమిని కూడా రేషన్‌ కార్డు కోసమంటూ వేలిముద్రలు వేయించి కొడుకులే మింగారు. ఆ భూమిలో సాగు చేసుకుంటూ వాటి ఫలాలను చిన్న కొడుకే తింటున్నాడు. పున్నామ నరకం నుంచి తప్పిస్తారని చెప్పే కొడుకులే ఆ గుడ్డి తండ్రిని పుట్టెడు కష్టాల్లో ముంచేశారు.
  అన్నంలో నీళ్లు, ఉప్పు కలుపుకొని..
  రేషన్‌బియ్యం 6కిలోలు తెచ్చుకునేందుకు వెంకట్‌రెడ్డి కర్ర సాయంతో గోడలను తడుముకుంటూ వెళతాడు. ఇల్లంతా తడుముతూ గిన్నె పట్టుకొని, బియ్యం కడుక్కొని వంట చేసుకుంటాడు. అది ఉడికిందా.. ఉడకలేదా అనేది కూడా తెలియదు. ఎవరైనా కూర వేస్తే సరి. లేకపోతే అన్నంలో ఉప్పు, నీళ్లు కలుపుకొని తింటాడు. ఖర్చులకు ఆసరా పింఛను ఉందని తెలిపాడు. తిండి పెట్టని కొడుకుల గురించి ఎవరూ అడగలేదా అని ‘ఆంధ్రజ్యోతి’ ప్రశ్నించగా ‘ఒకసారి రైతు సంఘమోళ్లు పిలిపించిర్రు. భూమి రిజిస్టర్‌ చేస్తే పెడతామన్నారు. ఉన్న భూమి పంచి ఇచ్చిండు కదా అంటే ఎకరా ఇరవై గుంటల భూమి కూడా రిజిస్టర్‌ చేస్తేనే తిండి పెడతామన్నరు. దాంతో, వాళ్లు కొడుకులను తిట్టి వెళ్లిపోయారు’ అన్నాడు. మొత్తానికే చేతకాక మంచాన పడితే ఎలా? అంటే.. ‘మా అయితే పురుగులు పడి చనిపోతా కదా!’ అన్నాడు.