కాంగ్రెస్‌ హయాంలోనే నిధుల మళ్లింపు: సీఎం కేసీఆర్‌

ఎస్సీలకు కేటాయించిన నిధులు కాంగ్రెస్‌ హయాంలోనే పక్కదారికి మళ్లించారని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఇవాళ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత ఎస్సీ, ఎస్టీలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఎస్సీల పేదరికం గుర్తించాం కాబట్టే అంబేద్కర్‌ ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ 20లక్షలు ఇస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన ప్రతీ పైసా నిజాయితీగా ఖర్చు పెట్టామన్నారు. అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని, అంతేగాని లెక్కలు చూపకుండా నిధులు మళ్లించారని విమర్శిస్తే సహించేది లేదని సీఎం అన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఎస్సీ, ఎస్టీ అభివృద్ధికి తెలంగాణ కృషి చేస్తుందని ఆయన అన్నారు. దళితులలో పేదరిక నిర్మూలన చేయడానికే ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.