దిలీప్‌@95 !!!!….

ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ 95వ పడిలోకి అడుగుపెడుతున్నారు. గత కొంతకాలంగా అస్వస్థతతో ఉన్న ఆయన ప్రస్తుతం న్యుమోనియాతో బాధపడుతున్నారు. దీని దృష్ట్యా జన్మదిన వేడుకలను పెద్దఎత్తున జరపడం లేదని, ఆయనకు బాగా ఇష్టమైన బిర్యానీ, ఐస్‌క్రీమ్‌ను మాత్రమే సిద్ధం చేస్తున్నట్లు ఆయన సతీమణి, నటి సైరాబాను ఆదివారం వెల్లడించారు. ‘ఆయనకు బిర్యానీ, ఐస్‌క్రీమ్ చాలాఇష్టం. డాక్టర్ల సూచన మేరకు కొద్దిగా తినిపించి ఆయన సంతోషంగా ఉండేలా చూస్తాను’ అని వివరించారు. ‘దిలీప్ సాబ్‌కు మంచి డ్రస్‌లంటే మక్కువ ఎక్కువ. అవి కూడా ఎక్కువ ఆర్భాటం లేకుండా ఉండాలని కోరుకుంటారు. కాటన్ షర్ట్, ప్యాంట్‌తోపాటు మ్యాచింగ్‌ను కోరుకుంటారు. షూ, సాక్స్ కూడా ఒకే రంగువి వేసుకోవడం ఇష్టం. ప్రస్తుతం ఆయన వద్ద షూ కలెక్షన్ భారీగానే ఉంది’ అని పేర్కొన్నారు. ‘దిలీప్‌కు ఖరీదైన బహుమతులంటే ఇష్టం ఉండదు. ప్రతి ఏటా స్థిరంగా నేనిచ్చే బహుమతి ప్రేమ. అదే ఆయన్ను ఉత్తేజంగా ఉంచుతుంది’ అని సైరాబాను వెల్లడించారు.
చిత్రం..ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్, సతీమణి సైరాబాను