యో-యో టెస్ట్‌ పాసైనా.. మొండిచేయే.!

 Yuvraj Singh Clears Yo-Yo Fitness Test, Sees Himself Playing Till 2019 - Sakshi

 భారత జట్టులోకి తిరిగి రావాలని నిరీక్షిస్తున్న సీనియర్‌ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌కు బీసీసీఐ మరోసారి మొండిచేయి చూపించింది. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను పరీక్షించే యో-యో టెస్ట్‌ పాసైనా యువరాజ్‌కు జట్టులో చోటు దక్కలేదు. బీసీసీఐ శ్రీలంకతో టీ20, దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే భారత జట్టును సోమవారం ప్రకటించింది. లంకతో టీ20లకు కెప్టెన్‌ కోహ్లి  విశ్రాంతి కోరడంతో సినీయర్‌ ఆటగాడైన యువరాజ్‌ తిరిగి జట్టులోకి వస్తాడని అందరూ భావించారు. కానీ బీసీసీఐ యువీకి అవకాశం ఇవ్వలేదు.

ఇక గతంలో మూడు సార్లు యోయో టెస్టుకు హాజరైన యువీ అర్హత మార్కు 16.1ని అందుకోలేక భారత జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు. తాజాగా మరోసారి టెస్టుకు హాజరైన అతడు 16.3 మార్కును అందుకొని టెస్ట్‌ పాసయ్యాడు. యువీతో పాటు యువ ఆటగాళ్లు వాషింగ్టన్‌ సుందర్‌, నితీశ్‌ రానా కూడా యోయో టెస్టులో విజయం సాధించారు. అయితే వాషింగ్టన్‌ సుందర్‌కు టీ20 జట్టులో చోటు దక్కడం విశేషం.

2019 వరకు ఆడాలనుకుంటా..
‘నేను ఇంకా ఆడుతున్నా.. ఏ ఫార్మాట్‌లో ఆడుతున్నానది మాత్రం ఆలోచించడం లేదు. కానీ ప్రతిరోజు బాగా కష్టపడుతున్నాను. 2019 వరుకు ఆడుతానని అనుకుంటున్నా. నా మీద ఇతరులకు నమ్మకం ఉందో లేదో కానీ నాకు మాత్రం నాపై పూర్తి నమ్మకం ఉంది. వైఫల్యాలతో బాధపడటంలేదు. ఒడిదొడుకులు ఎదుర్కోవడం సహజమే. ఓటమి విజయానికి మెట్టు అనేది నేను చూశా. ఇప్పటికి మూడు సార్లు యోయో టెస్ట్‌ విఫలమయ్యా. తాజాగా మరోసారి హాజరై పాసయ్యా’. అని యువరాజ్‌ యూనిసెఫ్‌ నిర్వహించిన ఓ కార్యక్రమంలో చెప్పుకొచ్చాడు.