వియత్నాం ఓపెన్‌ విజేత సాకేత్‌ జోడీ

Saketh Myneni-Prashanth clinch Vietnam Open

హైదరాబాద్‌: ఏడాదిన్నర విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ సాకేత్‌ మైనేని మరో ఏటీపీ చాలెంజర్‌ టోర్నీ డబుల్స్‌ టైటిల్‌ను దక్కించుకున్నాడు. హోచి మిన్‌ సిటీలో ఆదివారం జరిగిన వియత్నాం ఓపెన్‌ టోర్నమెంట్‌లో సాకేత్‌–విజయ్‌ సుందర్‌ ప్రశాంత్‌ (భారత్‌) జంట విజేతగా నిలిచింది.

ఫైనల్లో సాకేత్‌–విజయ్‌ ద్వయం 7–6 (7/3), 7–6 (7/5)తో గో సొయెదా–బెన్‌ మెక్లాచ్లాన్‌ (జపాన్‌) జంటపై విజయం సాధించింది. గంటా 52 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్‌ ద్వయం నాలుగు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. భారత డేవిస్‌ కప్‌ జట్టు సభ్యుడైన సాకేత్‌ కెరీర్‌లో ఇది ఏడో ఏటీపీ చాలెంజర్‌ డబుల్స్‌ టైటిల్‌. విజేతగా నిలిచిన సాకేత్‌–విజయ్‌ జోడీకి 3,100 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షలు)తోపాటు 80 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.