స్థానిక సంస్థల కోటా శాసనమండలి స్థానాల్లో అభ్యర్థులు … పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తేరా చిన్నపురెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి

స్థానిక సంస్థల కోటా శాసనమండలి స్థానాల్లో పోటీచేసే తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు  ఖరారుచేశారు.

MLC-local body cadts

వరంగల్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నల్లగొండ నుంచి తేరా చిన్నపురెడ్డి, రంగారెడ్డి నుంచి పట్నం మహేందర్‌రెడ్డిని అభ్యర్థులుగా ప్రకటించారు. ఈ మేరకు ముగ్గురు అభ్యర్థులకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ బీఫారాలను అందజేశారు.

జిల్లాల నాయకులతో సమన్వయంతో పనిచేసి, ఎన్నికల్లో విజయం సాధించాలని వారికి సూచించారు. నాయకులను సమన్వయం చేసే బాధ్యతను మంత్రులకు అప్పగించారు. అనంతరం టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామా రావు ఎమ్మెల్సీ అభ్యర్థులు, మంత్రులు, ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. పార్టీ అభ్యర్థులు గెలువడానికి అవసరమైన మెజారిటీ స్పష్టంగా ఉన్నదని తెలిపారు.

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో అధికశాతం మంది టీఆర్‌ఎస్‌కు చెందినవారే ఉన్నందున  ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉన్నదని సమాచారం.

సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, జీ జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వీ శ్రీనివాస్‌గౌడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, సీహెచ్ మల్లారెడ్డి, ఎంపీలు బోయినపల్లి వినోద్‌కుమార్, బండప్రకాశ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎం శ్రీనివాస్‌రెడ్డి, శంభీపూర్ రాజు, టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్‌రెడ్డి తదితరులున్నారు.

నామినేషన్లకు రేపు ఆఖరు: మూడు ఎమ్మెల్సీస్థానాల ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల గడువు మంగళవారంతో ముగియనున్నది. 17న నామినేషన్ల ఉపసంహరణకు గడువు. పోలింగ్ అనివార్యమైతే మే 31న నిర్వహించనున్నారు. జూన్ 3న ఓట్లను లెక్కిస్తారు.

రోడ్‌షోల ఇంచార్జి పోచంపల్లి: వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం వరికోల్ గ్రామానికి చెందిన పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి 1973 ఏప్రిల్ 15న జన్మించారు. ఆయనకు భార్య, కూతురు ఆశ్రితరెడ్డి ఉన్నారు. ఒకటి నుంచి 7వ తరగతి వరకు వరికోల్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో, 8 నుంచి 10వ తరగతి వరకు పరకాలలో సీఎస్‌ఐ మిషన్ హైస్కూల్‌లో చదివారు. హన్మకొండ నాగార్జున జూనియర్ కాలేజీలో ఇంటర్, హైదరాబాద్ ఏవీ కాలేజీలో డిగ్రీ పూర్తిచేశారు. పుణెలో ఎంబీఏ చేశారు. అక్కడ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ రూంమేట్‌గా ఉన్నారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్ సంయుక్త కార్యదర్శిగా కొనసాగుతున్నారు. జూబ్లీహిల్స్, గోషామహల్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల టీఆర్‌ఎస్ ఇంచార్జిగా ఉన్నారు. స్వగ్రామంలో డబుల్ బెడ్‌రూంల నిర్మాణానికి ఐదెకరాల స్థలాన్ని ఉచితంగా అందించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలతోపాటు, శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో కేటీఆర్ రోడ్‌షోలకు ఇంచార్జిగా వ్యవహరించారు. వరికోల్ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులను మహిళలకు ఏకగ్రీవం చేయడంలో కీలకపాత్ర పోషించారు.

ఫార్మా అధినేత చిన్నపురెడ్డి: తేరా చిన్నపురెడ్డిది నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పిన్నవూర గ్రామం. 2009లో నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, 2014 నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీచేశారు. 2016లో టీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్సీగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. శ్రీని ఫార్మాకంపెనీ అధినేతగా ఉన్నారు.

మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి: పట్నం మహేందర్‌రెడ్డి 1963లో జన్మించారు. ప్రాథమిక విద్య చేవెళ్ల మండలం కౌకుంట్ల గ్రామంలో సాగింది. హైదరాబాద్ సిటీ కాలేజీలో ఇంటర్ చదివారు. ఏజీ కాలేజీలో వెటర్నరీ విద్యనభ్యసించారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలంలో ప్రభుత్వ పశువైద్యాధికారిగా పనిచేశారు. 1988లో రాజకీయరంగ ప్రవేశం చేసిన మహేందర్‌రెడ్డి తాండూరు నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2013లో టీఆర్‌ఎస్‌లో చేరి.. 2014 నుంచి 2018 వరకు రాష్ట్ర రవాణాశాఖమంత్రిగా పనిచేశారు. సతీమణి సునీతా మహేందర్‌రెడ్డి వరుసగా రెండోసారి రంగారెడ్డి జిల్లాపరిషత్ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు.